మానవత్వం లేని వైద్యం వ్యాపారంతో సమానం.. ఇదీ మంత్రి మల్లారెడ్డి తన కొడుకు భద్రారెడ్డికి తరచూ చెప్పే మాట.. తండ్రి మాటలకు అర్ధం తెలుసుకున్న కొడుకు- డాక్టర్ చామకూర భద్రారెడ్డి.. అందుకు అనుగుణంగా వ్యవహరించడం మొదలయ్యి చాలా కాలమే అయ్యింది.. ఆయన దగ్గరకు ఎవరైనా పేదలు వైద్య సాయం కోసం వస్తే.. మొదట ఆయన వారి పర్సు చూడరు- పల్స్ చూస్తారు.. వారి గురించి వాకబు చేసి.. అందుకు తగిన ఉచిత వైద్య సాయమందిస్తారు..
2021 ఏప్రిల్ 17న మేడ్చల్ నివాసి.. మున్సిపల్ సిబ్బంది అయిన డబిల్ పుర లక్ష్మి ప్రమాద సమయంలో ఇదే నిరూపితమైంది. లక్ష్మి విధులు నిర్వహిస్తుండగా.. ఆమెను ఒక టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆమె ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కుంది.. ఆ వెంటనే ఆమెను దగ్గర్లోని మల్లారెడ్డి ఆస్పత్రికి చేర్చారు. అక్కడ ఆమె ప్రాణాలతో పోరాడుతుండగా.. తగిన వైద్య సాయం అందాల్సి ఉంది. అప్పటికే ఆమె ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం. ఈ విషయం గుర్తించిన మేడ్చల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ దీపికా రెడ్డి.. లక్ష్మి గురించి డాక్టర్ భద్రారెడ్డికి చెప్పారు. సమస్యను గుర్తించిన భద్రారెడ్డి- ఆమెకు ఉచిత వైద్యం అందించేందుకు ముందుకొచ్చారు.
డబ్బుకన్నా ప్రాణాలు మిన్నగా భావించి భద్రారెడ్డి అందించిన వైద్య సాయంతో కోలుకుంది డబిల్ పుర లక్ష్మి. అలా మల్లారెడ్డి ఆస్పత్రిలో ఉచిత వైద్య సాయంతో కోలుకున్న లక్ష్మి డాక్టర్ చామకూర భద్రారెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా భద్రారెడ్డికి తమ కృతజ్ఞతలు తెలిపారు.
వీరొక్కరే కాదు ఈ ప్రాంతంలోని చాలా మందికి భద్రారెడ్డి ఉదారత గురించి బాగా తెలుసు. మరీ ముఖ్యంగా పేదలు ప్రాణాపాయం ఎదుర్కుంటే ఆయన చూస్తూ ఊరుకోరని అంటారు మేడ్చల్ నాలుగో వార్డు కౌన్సిలర్ గణేష్. ఇలాంటి అనుభవాలు తనకు చాలానే ఉన్నాయని అంటారు గణేష్. అన్నా కష్టంలో ఉన్నా ఆదుకో అంటే భద్రారెడ్డి వెంటనే సాయం చేస్తారని చెబుతారు స్థానిక టీఆర్ఎస్ నాయకులు మర్రి నరసింహారెడ్డి.
గతం గతః భద్రారెడ్డి వర్తమాన సేవల గురించి చెప్పండీ అంటే అందుకు ఇదిగో మల్లారెడ్డి కోవిడ్ కేర్ సెంటరే అతిపెద్ద ఉదాహరణ. మల్లారెడ్డి ఆస్పత్రి అనుబంధ విభాగంగా మల్లారెడ్డి కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు భద్రారెడ్డి..ఈ సెంటర్లో కోవిడ్ పేషెంట్లకు గానూ 300 పడకలతో ఉచిత వైద్య సాయం అందిస్తున్నారు.. భద్రారెడ్డి. ఇక్కడ చేరాలంటే పెద్ద కష్టమేం కాదు. ఐసీఎంఆర్ ఆమోదం గల టెస్టులతో ఇక్కడి హెల్ప్ సెంటర్ కు కాల్ చేస్తే చాలు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ.. ఓటర్- ఆధార్ వంటి గుర్తింపు కార్డులతో ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో నేరుగా చేరిపోవచ్చు.
19- 60 ఏళ్ల మధ్యగల స్వల్ప లక్షణాలతో కూడిన కోవిడ్ పాజిటివ్ గల రోగులకు మల్లారెడ్డి కోవిడ్ కేర్ సెంటర్ ఓ సంజీవినిగా మారింది. మేడ్చల్ ప్రాంత వాసులకు ఈ కేర్ సెంటర్ ఒక వరంగా చెప్పాలి. ఇక్కడ చేరిన వారికి ఇరవై నాలుగు గంటల పాటు ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు. రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. వీటితో పాటు ప్రైమరీ మెడిసిన్ ఫ్రీగా అందజేస్తున్నారు. అంతేనా ఆక్సిమీటర్, ధర్మామీటర్- శానిటైజర్- మాస్క్- స్టీమ్ ఇన్హెలర్ వంటి వాటితో మెడికల్ కిట్లను సైతం అందజేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాంత వాసులకు మల్లారెడ్డి కోవిడ్ కేర్ సెంటర్ అందిస్తున్న ఉచిత వైద్య సదుపాయాలు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. ఇందుకు తాము మల్లారెడ్డి కుటుంబానికి ఎంతగానో రుణపడి ఉంటామని అంటారు స్థానికులు.
కేవలం ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో మాత్రమే కాదు.. ఆర్ధిక అత్యయిక పరిస్థితిలోనూ మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి తండ్రికి తగ్గ తనయుడనిపిస్తాడు. పేదల ఆకలి గుర్తించి వారికి ఆర్ధికంగా అండదండగా నిలుస్తున్నారు.
ఇలా ఈ ప్రాంత వాసుల్లో మంత్రి మల్లారెడ్డి కొడుకు డాక్టర్ చామకూర భద్రారెడ్డి పట్ల ఎంతో గౌరవ భావం నెలకొని ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యుల వైద్య ఆర్ధిక సేవలు తమకెంతగానో ఆదుకుంటున్నాయని ప్రశంసిస్తున్నారు స్థానికులు. అందుకు భద్రారెడ్డి అధ్వర్యంలో తమకు అందుతున్న ఉచిత కోవిడ్ వైద్య సేవలే సాక్ష్యమని అంటున్నారు.